Wednesday, 27 October 2021

లక్నవరం

 లక్నవరం సరస్సు

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా, కుతూహలంగా ఎదురుచూస్తున్న మా లక్నవరం టూర్ చక్కటి ఆహ్లాదం తో, ఉవ్వెళ్ళూరిన ఉత్సాహంతో, నింగినంటిన ఆనందంతో మా పిల్లల,మాతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ తో మా ఈ లక్నవరం టూర్ విజయవంతంగా పూర్తయ్యింది.
ఈ లక్నవరం సరస్సు తెలంగాణ లోని గోవిందరావు పేట మండలం లోని ,ములుగు జిల్లాలో ఉన్నది . ఇది వరంగల్ నుంచి అయితే 80Kms .హైదరబాద్ నుండి అయితే 210kms వరకు ఉన్నది ..మేము అయితే 3 ఫ్యామిలీస్ కలిసి హైదరాబాద్ నుంచి tempo మాట్లాడుకుని వచ్చాము.
ఇది తెలంగాణలో ప్రసిద్ది చెందిన మంచి పర్యాటక ప్రాంతం.ఇక్కడకు రోజూ కొన్ని వందలాది మంది పర్యాటకులు వచ్చి , ప్రకృతి తో ఏకమైన ఈ లక్నవరం సరస్సు అందాలని ఆస్వాదిస్తూ ఉంటారు. కళలకు అత్యంత ప్రాధన్యతను ఇచ్చే ఆనాటి కాకతీయ రాజు ప్రతాప రుద్రుని చేతుల మీదగా రూపు దిద్దుకుంది. నేటి తెలంగాణ ప్రభుత్వంలో "Rope Suspension Bridge" తో నూతనంగా ఆధునీకరించబడి పర్యటకులచే విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎత్తైన కొండల మధ్య  నిర్మింపబడిన ఈ సరస్సు ,చిన్న చిన్న దీవులను ఆవాసరంగా చేసుకుంటూ,చుట్టూ ప్రవహిస్తున్న నీటితో ఇది వెన్నెల ఉషస్సు లో, దివ్యంగా తన అందాల తో , నర్తిస్తున్నట్టు ఉంటుంది.ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఉండటానికి అద్దాలతో నిర్మించి చక్కటి view కనపడేట్టు గా వసతి, సాహసాలతో కూడిన బోట్ డ్రైవింగ్, సైక్లింగ్,చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా  కార్స్ రైడింగ్, Relax అవ్వటానికి , అలసటను తీర్చుకునేందుకు "Massage Chair" ఇలాంటివి ఈ resorts లో సమకూర్చబడినాయి. కంటికి కనిపించినంత దూరమంత ఆకుపచ్చని చెట్లతో ,మధ్యలో జలకళ తో చాలా రమణీయంగా ఉంటుంది .దీనిని ఒక మినీ ద్వీపంగా (island) చెప్పు కొనవచ్చు. ఉరుకులు ,పరుగుల జీవితంలో కాసేపు మనల్ని మనం మర్చిపోయి హాయిగా, ఫ్రెండ్స్ తోటి కాని,ఫ్యామిలీస్ తోటి కానీ ఆనందంగా ,సరదాగా గడపటానికి అనువైన ప్రదేశం ఈ లక్నవరం. మన ఒత్తిడిని తగ్గించుకుంటూ , మానసిక ప్రశాంత లభించాలంటే సుందరమైన నీటి వనరున్న ప్రదేశం ఈ లక్నవరం. పిల్లలకూ, పెద్దలకూ మంచి అనుభూతి ని వారి వారి స్వీట్ మెమోరీస్ గా నిలుపు కోవాలంటే ఇది ఉత్తమమైన location అనే చెప్పాలి. ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి చూడదగ్గ ప్రదేశం . అద్భుతమైన పర్యాటక కేంద్రం ఈ లక్నవరం...ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఈ ప్రదేశం ఒక వరం..
మేము అయితే ఒక సూర్యాస్తమయం & సూర్యోదయం చూసి ఉన్నాం ఇక్కడ ..రాత్రి నీటిలోని అలలు చంద్రుని చల్లదనానికి తపిస్తూ ,ఆ చంద్రుని కాంతిలో మా రూం లోనుంచి తన సొగసును విప్పారిన అందం చూసాం అలానే ఉదయాన్నే మంచు తుంపరలు సరస్సులోని నీటిని టచ్ చేసి వెనక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ పొగమంచు కవ్వింపుగా నడవటం చూసాం ..ఈ సన్నివేశం మంచి రొమాంటిక్ అనే చెప్పొచ్చు.

Friday, 28 September 2018

ఆర్టికల్ నెం . 2 :

*అనాధల దీపావళీ *

ఎందుకో అనిపించింది మనసుకి 
ఈ దీపావళికి సంబరం చెయ్యకూడదని 

ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తే 
ఎన్నో తారాజువ్వల వెలుగులు 
వడివడిగా సుయ్ మని రాకెట్ పరుగులు 
కాంతులెన్నో కళ్ళముందు కనపడుతున్నా 
ఏదో  అంధకారం మనసుకి కమ్మేసినట్టుంది 
గుర్తుకొస్తున్నారు రోడ్డుపై చిన్నారి ఆనాధలు 
మంచి రంగూ -వయసూ ఉన్నా ,దుమ్మూ -ధూళిలే పౌడరుగా అద్దుకుని 
చిరిగిన బట్టలు ధరించి దేహీ అని అడుక్కుంటూ 

అక్షరాలు చదవాల్సిన వారు 
రూపాయి కోసం తమ పెదవులు కదిలిస్తుంటే 
కడుపులోపల పేగునేదో నలిపేసినట్టు 
మనకు ఉన్నాయని ఆనందించాలో 
వాళ్ల దుస్థితి చూసి రోదించాలో 
తెలియని నేను తటస్థమై ఓ నిముషం 
నిశ్శబ్దంలో ఓ


 

Tuesday, 17 July 2018

ఆర్టికల్ నెం . 1 :

* నా మధుర క్షణాలు *

నాకు చిన్నప్పటి నుండి అమ్మ అంటే బాగా ఇష్టం . నాన్న గారు నాకు చిన్నతనం లోనే అంటే నాకు లోకం తెలియని పసి వయసులోనే కాలం చేశారు . కాబట్టి అమ్మ చాటు బిడ్డగానే పెరిగాను . అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది . పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి అమ్మే  ఒక మధురమైన  సుపరిచయం . ఇప్పుడు నేను అమ్మకి అండగా ఉంటూ , చూసుకుంటున్నాను అది నా అదృష్టమే . అమ్మ తరవాత నాకు అమ్మలా నా జీవితంలోకి అడుగిడిన వ్యక్తి నా శ్రీమతి - తాను నాకు ఒక మంచి బహుమతి . నాకు చిన్న చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం పసి పిల్లలని దేవుళ్లుగా అనుకుంటారు చాలా మంది వాళ్లలో నేను కూడా ఒకడిని . మాకు పెళ్ళైన చాలా కాలానికి మేము ఆశగా , ప్రేమగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది . మా ఇంటి కి ఒక మహాలక్ష్మీ చిట్టి తల్లి రూపంలో వచ్చింది .అదేనండీ నాకు అమ్మాయి పుట్టింది . పుట్టకముందే అమ్మాయా (లేక ) అబ్బాయా అని తెలుసుకుంటారు చాలా మంది మేము కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు .తను పుట్టగానే ఆ క్షణం లో ఎంత ఆనందం చెందానో ఆ ఆనంద క్షణాలను నేను ఎప్పటికీ మరచిపోలేను .ఒక్కసారిగా ఎగిరిగంతు  వేసి డాకర్ట్ దగ్గరికి వెళ్లి తల్లి -బిడ్డ క్షేమమా అని మాత్రమే అడిగి తెలుసుకున్నాను . నా శ్రీమతిని కౌగలించుకుని , నుదుటిని మీటుతూ నా కృతజ్ఞత తెలియచేసుకున్నాను . కాసేపు సమయం గడిచాక అక్కడ హాస్పిటల్ నర్స్ తీసుకు వచ్చి అమ్మాయి అని చూపించారు . ఇంకేముంది ఇక అందరికీ సమాచారం చేరవెయ్యటమే కదా నాకు ఒక రోజంతా ఉక్కిరి -బిక్కిరే నేను నాకు అమ్మాయి పుట్టింది నాకు అమ్మాయి పుట్టింది అని . నాకు ఇప్పటిదాకా మర్చిపోలేని మధుర క్షణాలు /జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయేమో కానీ నా బుల్లి బుజ్జి పాప ని చూసి ఇది మాత్రమే నాకు మధురమైన ఆనంద వీక్షణం లా నా డైరీలో పేజీలు అన్నీ ఒకే ఒక్క నా పాప రూపేనా మారిపోయాయి .నాకు నా శ్రీమతి నాకు వార్త చెప్పిన దగ్గర నుంచి నాకు అమ్మాయే రావాలి ,అమ్మాయే కావాలి అని నా మనసులో బలంగానే అనిపించింది అది ఆ దేవుడికి తెలిసినట్టుంది . అందుకే నా చిట్టి తల్లి రూపంలో నాకు కానుకనందించాడు . ఇంత సంతోష విషయంలో కూడా కొన్ని తట్టుకోలేని పదాలు నాకు దగ్గర బంధువుల నుంచి వినటం అదేనండి ఇంకేముంటాయి ఏంటి అమ్మాయా ! అమ్మాయి పుట్టిందా ! అబ్బాయి అనుకున్నాము ! అబ్బాయి అయితే బాగుండేది అంటూ కొన్ని వాక్కులు వినక తప్పలేదు . అలానే కొంతమంది దగ్గర వాళ్ళు మరియు దూరం వాళ్ళు మంచి వార్త చెప్పావు .మహాలక్ష్మిని ఇంటికి తెచ్చుకున్నావు అని అంటుంటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది . ఇప్పటికి తను ఈ భూమిపైకి వచ్చి ఒక వారం దాటింది అనుకుంటా . నేటికాలంలో అమ్మకు కోడలు కావాలి ,అత్తకు కూతురు కావాలి ,కాని ఒక కూతురు ఒక కూతురికి తల్లి కాకూడదు .ఒక కోడలు అమ్మాయికి జన్మ నివ్వకూడదు ఇలాంటివి చాలానే వింటూ ఉంటాం ,చూస్తూ ఉంటాం . నాకు అమ్మ అమ్మ తర్వాత భార్య తర్వాత నా కూతురు ఇదే నా ప్రపంచం . చిన్ని చిన్ని పాదాలు , చిట్టి చిట్టి చేతులు ,ముద్దొచ్చే మోము , ముట్టుకోవాలి అనిపించే నోరు మొత్తం కలిపి ఓ చిన్ని అరచెయ్యి అంత రూపం అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ,తనకి ఏమీ కాకుండా బంగారం లా చూసుకోవాలనిపిస్తుంది . అన్నీ ముందస్తుగానే ఒక ప్రణాళిక నాలో మొదలయ్యిపోయింది . ఇంటికి ఎప్పుడు తీసుకురావాలి , పేరు ఎప్పుడు పెట్టాలి , బారసాల ఎప్పుడు చెయ్యాలి వచ్చే సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలు ఎలా చెయ్యాలి ? అంటూ ఒకటే ఒకటే ఆలోచన నా మనసుని తులిపేస్తుంది అనుకోండి . ఏదేమైనా గాని ఈ విశాల ప్రపంచంలోకి నా కూతురు బంగారు కాంతిలాగా అడుగు పెట్టింది . ఇది నా జీవితంలో నేను మరువబోని ,మరచిపోలేని ఒక మధురమైన అనుభూతుల కావ్యం . ఇంకా ముందు ముందు తన కోసం నేనేమి చేస్తానో , ఎన్ని  కావ్యాలు రాస్తానో నాలో నాకే ఒక జిజ్ఞ్ఞాస గా ఉంది . బంగారు తల్లికి బంగారు భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ ఈ బంగారు క్షణాలని ఇలా బందించి రాసుకున్నా !

నా '' బంగారు తల్లి '' కోసం ఒక కవిత
చిన్ని చిన్ని పాదాల సిరి మా తల్లి
చిట్టి చిట్టి చేతుల సింగారి బుల్లి

మా కోసమొచ్చింది ఈ చిట్టి తల్లి
మా ముందు వెలసింది రంగుల వెల్లి

మా ఇంటికొస్తుంది మురిపాల లిల్లి
అప్పుడే మొదలయ్యింది లాలీ జో లాలీ

అపురూపంగా చూసుకోవాలి మళ్లీ మళ్లీ
ప్రేమనంతా తీసుకొచ్చింది ఈ పుడమి తల్లి

ఆనందం కురుస్తుంది ఆకాశపు జల్లై
తన్మయత్వ మొందుతుంది తనువు హరి విల్లై

గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
హైదరాబాద్
9705793187

 









Monday, 2 November 2015

అన్నవరం ప్రయాణం :

అన్నవరం 
ఇది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లోని 
తూర్పు గోదావరి జిల్లాలో 
శంఖవరం మండలానికి చెందిన గ్రామంలో ,
పంపా నది సమీపంలో ''రత్నగిరి '' అనుకొండపై 
''శ్రీ వీర వెంకట సత్యన్నారాయణ స్వామి '' కొలువై ఉన్న దివ్యక్షేత్రం ,
తప్పక చూడవలసిన సుందర ప్రదేశం కూడా . 
ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది 
అయితే కార్తీకమాసంలో ఇంకా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు . 
ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యన్నారాయణ స్వామీ వ్రతాన్ని కనుల పండుగ గా చేసుకుంటూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత 

ఇక్కడికి నేను వెళ్ళటం రెండవసారి అయితే అంతకు ముందు ఎప్పుడూ లేనిది ఈ సారి ఎందుకో చాలా తృప్తిగా అనిపించింది . కలిసిన ప్రతి వ్యక్తిలో ఒక మంచి సహకారం లబించింది . రైలు దిగిన దగ్గర నుంచి తిరిగి మేము భాగ్యనగరం రైలు ఎక్కేంత వరకు ఎంతో ఆతిద్యాన్ని ,ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని అందుకుంటూనే ఉన్నాము . ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తినుంచి దొరికినంతవరకు దండుకుందాం అని ఒక ఆటోవాలా నుంచి గాని , ఆలయ సిబ్బంది నుంచి గాని ,అక్కడ పని చేసే పూజారుల నుంచి కాని కనపడలేదు . అప్పుడు అనిపించింది ఇది చిన్న చిన్న మద్య తరగతి కుటుంభాల నుంచి పెద్ద పెద్ద ధనికుల వరకైనా ఎంతో సౌలభ్యమైనదని . దగ్గరుండి చాలా ఓపికగా పూజను చేయించే పూజారులు ,అటు లైన్లో గంటల తరబడి నుంచుంటూ భక్తులకు సహాయపడే సిబ్బంది చాలా చక్కగా చూడ ముచ్చటగా అనిపించింది ఎందుకంటే అంతరాలయ దర్శనం అని లోపలి వెళ్ళిన మేము అక్కడ దర్శనం సంతృప్తి నివ్వకపోతే సిబ్బంది పిలిచి మరీ ,మరోసారి దర్శన బాగ్యాన్ని కలిగించిన తీరు ప్రశంసనీయం . అక్కడి వాతావరణమేమో ,ప్రతీ వారి నుంచి ఎంతో మర్యాద ,చక్కటి భాష ,మనకు తెలియనివి ఓపికగా మనకు తెలియ చెప్పే నేర్పు అలా వీరికి మాత్రమే సాధ్యం అన్నట్టు ఉంది . అంతరాలయ దర్శనం లో ఆ స్వామిని చూస్తే అలా చూస్తూనే ఉండాలి అనిపించింది . అలా కిందకు వచ్చి స్వామి వారి యంత్రాలయం (ఆయన పాదములు ఉన్న ప్రదేశం ) ,అక్కడి పవిత్రమైన గోధుమ నూకతో చేసే ప్రసాదం అమృతనీయం . కొన్ని గంటలు ఆ ప్రదేశం లో ఉంటే ఏదో మనసులో ఒక ప్రశాంతత , నిర్మలత్వం అడుగడుగునా ఉప్పొంగుతున్న భక్తి భావం . అక్కడి పూజారులు చెప్పే స్వామి వారి వృత్తాంతం ,మహిమలు చెప్తుంటే మారు మారు మారో మారు ఇక్కడికి రావాలనే మనో సంకల్పం కలుగుతూ ఉంటుంది .